అరచేతిలో ప్రభుత్వ సేవలు.. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పొందే అవకాశం, ఒకే యాప్‌లో 160 రకాల పనులు.

0
345

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించిన అనేక సేవలను ఇప్పుడు అరచేతిలో ఉన్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొందొచ్చు. ఈ మేరకు ‘ఉమంగ్‌ యాప్‌’ నుంచి సరికొత్త సేవలు పొందొచ్చు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ సైబర్‌స్పేస్‌ ఆధ్వర్యంలో ఉమంగ్‌ (యూనిఫైడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఫర్‌ న్యూ ఏజ్‌ గవర్నెన్స్‌) యాప్‌ను ఆవిష్కరించారు. ఇందులో పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను మాత్రమే అనుసంధానం చేశారు. ఈ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 160కిపైగా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని రాష్ర్టాల పథకాలను అనుసందానం చేశారు. అయితే ఇది స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా కంప్యూటర్లలో కూడా ఉపయోగించే వెసులుబాటు కల్పించారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1800115246 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.


ఇన్‌స్టాల్‌ చేసుకోండిలా.. స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన ప్రతి ఒక్కరూ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉమంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి. తర్వాత ఒక కోడ్‌ వస్తుంది. కోడ్‌ వచ్చిన అనంతరం దానికి అనుసంధానం కావాలి. ఈ-మెయిల్‌కు సైతం అనుసంధానం చేశాక, నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే యాప్‌ వినియోగంలోకి వస్తుంది. మనకు కావాల్సిన పథకం సమాచారం తెలుసుకోవచ్చు.


యాప్‌తో ఉపయోగం… ఉమంగ్‌ యాప్‌లో ఆధార్‌కు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకునేందుకు డీజీ లాకర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. ప్రస్తుతం ఈ యాప్‌లో 160 రకాల సేవలు అందుబాటులో ఉండగా, భవిష్యత్‌లో 1200 సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల భవిష్య నిధి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కొత్తగా పాస్‌వర్డ్‌ కోసం దరఖాస్తు, రైతుల పంటల వివరాలు తెలుసుకోవచ్చు. ఐటీ శాఖకు ఆదాయ పన్ను చెల్లించవచ్చు. ఉపకార వేతనాలు, ఆధార్‌కార్డులో తప్పొప్పులు, సవరణలు, ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ- పుస్తకాలు, జాతీయ పెన్షన్‌ విధానం, పంటల బీమా తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉమంగ్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. ఒకే యాప్‌లో వందల రకాల సేవలను పొందేలా ఉండటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here