‘చి.ల.సౌ’ మూవీ రివ్యూ

0
1137

టాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ చిత్రాలకు ఇటీవల ప్రేక్షకాదరణా బ్రహ్మండంగా ఉంటున్నది. నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం చిలసౌ. ఈ చిత్రంలో రుహానీ శర్మ, సుశాంత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ, లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? సుశాంత్ కెరీర్‌కు ఈ సినిమా దోహదపడుతుంది. రుహాని శర్మ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మన సమీక్షలోకి వెళ్లాల్సిందే.

అబ్బా.. ఈ పెళ్లిచూపులు ప్రాసెస్ ఉంది చూశారూ.. ఎంత చెత్త ప్రాసెస్ ఇది. ‘ఎవరో ఇంటికి వెళ్లి కూర్చుంటే ఓ 20 మంది నన్నే చూస్తుంటారు. సడన్‌గా ఓ అమ్మాయి వచ్చి.. కాఫీ ఇచ్చి.. టెర్రస్ పైకి తీసుకువెళ్లి సరదాగా హాయ్, హలో చెప్పుకుని కిందకు రాగానే.. చెప్పు!! ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉంటావా? అని అడిగేస్తారు? ఐదు నిమిషాల్లో లైఫ్ లాంగ్ మనతో ఉండేది ఈ అమ్మాయే అని ఎలా డిసైడ్ అయిపోతాం? ఇలాంటి పెళ్లి నాకు వద్దు బాబోయ్..

‘నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని, సల్మాన్ అభిమానిని’ అనుకునే అబ్బాయి.. వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు.. కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లే జీవన్మరణ సమస్యగా మారిన అమ్మాయి.. కూతురి పెళ్లి చూడాలని కలలు కనే తల్లి.. ఇలాంటి సున్నితమైన భావోద్వేగాల నడుమ అర్జున్‌ (సుశాంత్), అంజలి (రుహానీ శర్మ) జీవితం ఓ రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయనేదే ‘చి. ల. సౌ’ సినిమా కథాంశం.

అర్జున్ బ్రేకప్ తర్వాత జరుగుతున్న విషయాలను, తాను పడే మానసిక సంఘర్షణ గురించి చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. అర్జున్, స్నేహితుడు (వెన్నెల కిషోర్‌)తో మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలతో ఫీల్‌గుడ్ నొటేషన్‌లో చాలా కామ్‌గా ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కథ ముందుకెళ్తుంది. ఇక అంజలితో పెళ్లిచూపులతో భావోద్వేగమైన కథ ఆరంభమవుతుంది. ఓ సన్నివేశానికి, మరో సన్నివేశానికి ఎమోషనల్ స్థాయి పెంచుకొంటూ పోవడంతో ఓ మంచి సినిమా చూస్తున్నాననే ఫీలింగ్‌లో ప్రేక్షకుడు మునిగిపోతాడు. వెన్నెల కిషోర్ కామెడీతో ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో రెండో భాగంపై ఆసక్తిపెరిగే విధంగా ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

మొదటి భాగంలోనే ఓ మంచి సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్‌తో ఉన్న ప్రేక్షకుడికి రెండో భాగంలో నవరసాలు కలబోసిన సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతాయి. రెండో భాగంలో హాస్పిటల్‌లో జరిగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సన్నివేశం ప్రేక్షకులకు హాస్యాన్ని పంచడంతోపాటు.. భావోద్వేగాన్ని గురిచేస్తుంది. అంజలి ఫ్లాష్‌బ్యాక్ గురించి తన మేనమామ (జయప్రకాశ్) చెప్పిన అంశాలు ప్రేక్షకుడిని భావోద్వేగంలో బంధిస్తాయి. చక్కటి ముగింపుతో అన్ని రకాలు రుచులున్న పెళ్లి భోజనం ఆరగించిన ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు రావడం అనేది జరుగుతుంది.

టెక్నికల్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఒక పెద్ద ఫ్లాట్, మరో చిన్న ఇల్లు, హాస్పటల్‌లోనే సినిమాను షూట్ చేసినా అన్ని ఫ్రేమ్స్ చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌ పనితనం సినిమాలో కనిపిస్తుంది. సందర్భానుసారంగా వచ్చే పాటలు, నేపథ్య సంగీతంతో ప్రశాంత్‌ విహారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకున్నారు. అక్కడక్కడా కొన్ని సీన్లకు ఎడిటర్ కత్తెర వేస్తే బాగుండేది. కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉన్నాయి.

ప్రతిభావంతుడైన నటుడు రాణించలేకపోవడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ రాహుల్ రవీంద్రన్ తొలిచిత్రంతోనే గొప్ప విజనరీ ఉన్న దర్శకుడిగా కనిపిస్తాడు. ఒక చిన్నపాయింట్‌తో తెర మీద పాత్రలతో మ్యాజిక్ చేసిన విధానానికి ప్రేక్షకుడు థ్రిల్ కావడం తథ్యం. పాత్రల తీరును రాసుకొన్న విధానం, కథను నడిపించిన తీరు సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచిని చెబుతాయి. తొలి చిత్రమైన ఎక్కడా తొణికిసలాట కనిపించదు. ఆయనలో ఉన్న దర్శకుడి గురించి చెప్పడాకి అంజలి తల్లి అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకే ఓ సీన్ చాలనిపిస్తుంది. మహిళా చైతన్యం అనే అంశంతో అంజలి పాత్రను రూపుదిద్దిన తీరు హ్యాట్సాఫ్. చి.ల.సౌ చిత్రంతో దక్షిణాదికి రాహుల్ రవీంద్రన్ రూపంలో మరో మంచి దర్శకుడు దొరికాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఓవరాల్‌గా తెలిసిన కథనే తికమక పెట్టకుండా నీట్ అండ్ క్లీన్ స్క్రీన్‌ప్లేతో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు మినిమన్ గ్యారంటీ మూవీ ఇచ్చాడు దర్శకుడు. మ్యాగ్జిమ‌మ్ బోర్ కొట్ట‌కుండా ‘చి.ల.సౌ’ క‌థ న‌డిపించడంలో పాత నటుడు, కొత్త దర్శకుడు రాహుల్ రాహుల్ రవీంద్రన్ స‌క్సెస్ అయ్యాడనే చెప్పాలి. యూత్‌ బేస్డ్ మూవీ కావడంతో మల్టీప్లెక్స్‌లలో ‘చి.ల.సౌ’ చిత్రానికి రెడ్ కార్పెట్ పరుస్తారు. మాస్ ఆడియన్స్‌ని మెప్పించే ఎలిమెంట్స్ లేకపోవడంతో బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కి ‘చి.ల.సౌ’ సాగదీతలా అనిపించవచ్చు. అయితే ఈ సినిమాలో చాలా రియల్‌ మూమెంట్స్‌ ఉండటం వల్ల యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here